Joe Root • India national cricket team • Virat Kohli • Steve Smith
చెన్నై: సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా సొంతగడ్డపై మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి చెన్నై చిందంబరం స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్ సారథి జో రూట్‌కు ఎంతో ప్రత్యేకం. అతడికి ఇది వందో టెస్టు మ్యాచ్. ఈ సందర్భంగా రూట్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నాడు. జూనియర్ స్థాయి క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచే స్పిన్‌ను చక్కగా ఎదుర్కొనేవాడినని, కచ్చితత్వంతో స్వీప్ షాట్ ఆడటం అక్కడే నేర్చుకున్నానని చెప్పాడు.
బాల్యంలో నేను బక్కపల్చగా ఉండేవాడిని:
'బాల్యంలో నేను బక్కపల్చగా ఉండేవాడిని. దేహదారుఢ్యం పెంచుకొనేందుకు చాలా ఏళ్లు పట్టింది. బంతిలో వేగం ఉండదు కాబట్టి స్పిన్నర్ల బౌలింగ్‌లో ఆడేందుకు నేనో దారి కనుక్కోవాలని అనుకున్నా. స్వీప్‌తో ఎక్కువ బలం సృష్టించొచ్చని తెలుసుకున్నా. కొంతమంది అద్భుత ఆటగాళ్లు, కోచ్‌ల వద్ద ఎన్నో మెలకువలు నేర్చుకున్నా. కేవలం డిఫెండ్ చేసేందుకో, ఆధిపత్యం వహించేందుకో ప్రయత్నించను. బంతిని బట్టి ఆడతాను. క్రీజులో కాసేపుంటే ఎక్కువ పరుగులు చేస్తాను. బక్కపల్చగా ఉన్నందుకే స్పిన్ బౌలింగ్‌లో ఆడేందుకు ఈ షాట్ నేర్చుకున్నా' అని జో రూట్ తెలిపాడు.
చిన్న యుద్ధమే ఉండొచ్చు:
'సొంతగడ్డపై రవిచంద్రన్ అశ్విన్‌కు మంచి రికార్డుంది. అయితే నేనతడి బౌలింగ్‌లో ఆడాను. భారీ పరుగులూ చేశాను. కొన్నిసార్లు అతడూ నాపై ఆధిపత్యం చెలాయించాడు. టెస్టు మ్యాచులో మా ఇద్దరి మధ్య చిన్న యుద్ధమే ఉండొచ్చు. యార్క్‌షైర్ క్లబ్ క్రికెట్ ఆడేటప్పుడు పాక్ క్రికెటర్ నదీమ్ ఖాన్‌తో ఆడుతూ స్వీప్ షాట్‌కు మెరుగులు దిద్దుకున్నా. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ గొప్ప క్రికెటర్లు. వారి వద్ద నేర్చుకొనేందుకు ఎప్పుడూ వెనుకాడను' అని వందో టెస్టు ఆడబోతున్న జో రూట్ చెప్పాడు. రూట్ 99 టెస్టుల్లో 8249 రన్స్ చేశాడు.
పుజారా మాకు పెద్ద వికెట్:
'చెతేశ్వర్ పుజారా గొప్ప ఆటగాడు. యార్క్‌షైర్‌లో అతడితో కలిసి కొన్ని మ్యాచులు ఆడినందుకు సంతోషగా ఉంది. బ్యాటింగ్ గురించి అతడితో మాట్లాడేవాడిని. క్రికెట్‌పై అతడికున్న ప్రేమ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. పుజారాతో కలిసి ఆడినా, ఎదుర్కొన్నా నేర్చుకొనేందుకు ఎంతో అవకాశం ఉంటుంది. అతడు టీమిండియాకు ఎంతో విలువ చేకూరుస్తాడు. పుజారా మాకు పెద్ద వికెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడి సుదీర్ఘ ఇన్నింగ్స్‌ను తట్టుకొనేందుకు మేం మానసికంగా బలంగా ఉండాలి. పుజారా మానసికంగా ఎంతో బలవంతుడు' అని ఇంగ్లండ్ సారథి పేర్కొన్నాడు.
Comments
Post a Comment